జీవితం అన్న పదానికి సంపాదన మారుపేరు.
ఏదో పొందుదామని, పొంది ఎక్కడికో చేరుకుందామని అని శ్వాసశ్వాసనా మనిషికిగల అంతర్గత కాంక్షకి మరోపేరు సంపాదన.
పుట్టిన ప్రతి మనిషీ జీవించినంతకాలం సంపాదిస్తూనే ఉంటాడు. కనీసం సంపాదనే ధ్యేయంగా రోజు గడుపుతాడు. మీరూ నేనుకూడా ఈ సూత్రానికి భిన్నం కాదు.
అందులో తప్పేమీలేదు. సిగ్గుపడవలసిందీ లేదు. ఏ కోరిక లేకపోతే అసలు బతకడం ఎందుకు? ప్రాయోపవేశం చేసుకుని జీవితం చాలించుకోవచ్చుగా!
సంపాదించాలనే కోరిక ఫలస్వరూపం ఆస్తి, సంపద.
ఇన్కమ్ టాక్స్ వాళ్లు గుర్తించే నెట్వర్త్ కాక ఇంకేమైనా ఆస్తి ఉంటుందా?
ఉంటుంది. అదే నిజమైన ఆస్తి. ఎంత అనుభవించినా తరగని ఆస్తి. కుటుంబానికి, ఇరుగుపొరుగుకి ఎంత రాసినా తరగని ఆస్తి.
ఇనప్పెట్టిలో మూలుగుతున్న, రేపు తిందామనుకునే ఆస్తి కాదు.
ఈ క్షణం అనుభవించగలిగే ఆస్తి. అస్తిత్వానికి అసలైన నిర్వచనం అనిపించుకోగలిగే ఆస్తి. వర్తమానానికి సిసలైన స్వరూపమైన ఆస్తి.
మనమందరం సంపాదించుకున్న ఆస్తి. అప్పనంగా భగవంతుడిచ్చిన ఆస్తి. ఆశీర్వచనం.
ఉదాహరణకి బాలసుబ్రమణ్యం నా ఆస్తి. బాల మురళి నా ఆస్తి.
ఈ రెండు ఉదాహరణలు చాలవూ, చాన్తాడంత నా ఆస్తి అంతా మీకెందుకు ఏకరువు పెట్టాలి? మీ ఆస్తి మీది నా ఆస్తి నాది.
సాహిర్ లుధ్యాన్వీ నా ఆస్తిలో పెద్ద పద్దు.
ఆయన రాసినవి అనేక గీతాలు. ఆ పెద్ద పద్దులో ఇదోఎంట్రీ.
"మై పల్‌దో పల్‌కా షాయర్ హూ"
నా ఆస్తి ఈక్షణంలో అనుభవించద్దూ, నాకొచ్చిన నాతెలుగులో?
నేనీ నిముషపు రచయితని
నిముషము మెరిసే మిరుమిట్లు
వెనువెంటనే కమ్మే చీకట్లు
మహనీయులు కవులూ గాయకులు
మురిపించి కనుమరుగయినారు
నిముసము సేపూ అందరు
మేలిమి బంగరు మరి కొందరు
నా రచనలు నువ్వూ మెచ్చావు
నిన్నేమయినా అవి మార్చాయా
నేనే మయినా మరి మారానా
అసలెందుకు ఎవరూ మారాలి?
ఆరాముడు ఇపుడే మెరిశాడు
రఘురాముడు కొలువుతీరాడు
రచనలు లల్లా రచియిస్తాడు
నీ వీనుల మళ్ళీ విందవుతాడు
రేపటి రోజున రాబోరా
వేలకు వేలు కవి పుంగవులు
విశ్వనాధలు శ్రీశ్రీలు
సిరివెన్నెలలు, శ్రీనాధులు
నేనూ ఒక రచయితనైతే
నువ్వూ ఒక పాఠకుడివైపో
ఈ నిముషానికది పర్యాప్తం
మరు నిముషములో సమాప్తం
https://youtu.be/QkGqpVYjLUw?si=sWtNxVVHJQx3qU3R
ఎంత భావగర్భితంగా ఉంది!! చివరి రెండు పంక్తులు పూర్ణ స్ధాయికి తీసుకెళ్లాయి. 👏👏🙏👍
ReplyDeleteGod bless you నగేష్. తెరుచుకున్న కవాటాల్లోంచే సూర్యుడు గృహంలో ప్రవేశిస్తాడు.
ReplyDelete🙏
ReplyDelete