రాసే వారెందుకు రాయాలి?
నిజమే కదండీ! వృత్తిపరంగానో వ్యాపారంలో భాగంగానో, కళాశాలల్లో నిబంధనగానో రాసేవాళ్ళని పక్కన పెడదాం. ఈ మూడు విభాగాలకి చెందనివారుకూడా పుటలుపుటలుగా పుంఖానుపుంఖాలుగా రాస్తూనే ఉన్నారు. వీరికి ధనాపేక్ష ఉండక పోవచ్చు. ఒకవేళ ఉన్నా రూపాయి లాటరీ టికెట్ కొని లక్షరూపాయలు వస్తాయని ఆశించడం వంటిదని వారికి తెలుసు. అయినా కథలు, నవలలు, వ్యాసాలు, కవితలు, ఉపదేశాలు, రాస్తూనే ఉన్నారు. సుమారుగా గత రెండు దశాబ్దాలుగా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని రచయితలు సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ప్రమాణాలు పాటిస్తూ, నాణ్యతలు పెంచుకుంటూ రాసేవారి సంఖ్య పూర్వం కంటే పెరగకపోవచ్చు, నిజానికి తగ్గుతూ ఉండవచ్చు. రచనలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. అధిక శాతం తెలుగులో రాసేవాళ్ళు మను చరిత్ర, వేయిపడగలు వంటి రచనలు చదివి ఉండరు. కొంతమంది ఆపేర్లుకూడా వినిఉండకపోవచ్చు. రాయలేని వారు ఎందుకు రాస్తున్నారు? ఎందుకు రాయాలి?
మనపేరు అచ్చులో చూసుకోవటం ఒక థ్రిల్. తెలుగులో టైప్ చెయ్యటం తెలుసుకోవటానికి కావలిసిన అయిదు నిమిషాలు వెచ్చించటానికి ససేమిరా అంటూ పది సంవత్సరాల నించీ తెలుగుని ఇంగ్లీషులోనే రాసే ఉదాత్తులకి కూడా పేరుని అచ్చులో చూసుకోడం థ్ర్రిల్. వారు తెలుగు భాష ఔన్నత్యాన్ని సైతం ఆంగ్లలిపిలోనే తెలుగురాసి మనకి వివరిస్తారు. ఆ థ్రిల్ తరవాత లైకులు. జూకర్‌బర్గ్ ఏముహూర్తాన లైకు అన్న పదాన్ని ప్రపంచం మీద వదిలాడోగాని నేడు రోటీ కపడా మకాన్ తర్వాత లైకు నిత్యావసర వస్తువైపోయింది.
ఏ ప్రశ్నకో "నాకటువంటివి ఇష్టంలేదు" వంటి సమాధానం రాసి, ఆ గొప్ప సమాధానానికి ఎన్ని లైకులొచ్చాయో అయిదునిముషాలకి ఒకసారి ఫోను చూసుకునే పరిస్థితి. ఈమాత్రం కూడా రాయలేనివారు 'ఫార్వార్డు' లు చేస్తారు. లైకులు చూసుకోవడం షరా మామూలే. లైకులేకాదు, 'షేర్'లవాలని కోరుకుంటారు.
చదివారెందుకు చదవాలి?
ఇదీ ముఖ్యమైన ప్రశ్నే. ఎవరూ చదవకపోతే, లైకులందుకోకపోతే ఇన్నేసి నాసిరకం రాతలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఛదివేవారూ ఎంతకొంత రాసేవారే కాబట్టి. తోటి లైకువాంఛితులు ఏంరాస్తున్నారో చూడాలి కాబట్టి. లైకులో అన్‌లైకులో కొట్టాలి కాబట్టి. రచనలకి మార్కులేసే జడ్జి పీఠంలో మన్ని మనం ప్రతిష్టించుకున్నాం కాబట్టి. లైకులందుకోవడానికి సామాజిక పరిచయాలు అవసరం కాబట్టి. పరస్పరావసరం కాబట్టి. నూటికో కోటికో ఒక కళ్ళు తిప్పుకోలేని రచన తటస్థ పడుతుంది. గొప్ప రచనని తెలుస్తుంది కాని లోపల ఎక్కడో ఏదో గుచ్చుకుంటుంది. రాసినవాడు ఇంతకుముందే తెలిసినవాడైతే మరీ గుచ్చుకుంటుంది. స్నేహితురాలి మెడలో అందమైన వజ్రాలహారంచూసి 'బావుంది కానీ మీ చెల్లెలికి బాగా నప్పుతుంది' అన్న దిగదుడుపు ధోరణిలో విమర్శలు రాస్తారు. రాజమౌళి మూడు సంవత్సరాలు శ్రమించి సినిమా తీస్తే దానిగురించి తెలిసీ తెలియని విమర్శలు రాసి అయిదుకి మూడుచుక్కలిచ్చి ఘనకార్యం చేసినట్లు ఫీలయే వారిలాగా!
రాసేవారి స్థాయి, చదివేవారి స్థాయి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. తెలుగువారు జాతిరీత్యా మేధావులు. వారి మేధస్సు ప్రస్తుతం ఫోన్లమీద వృధా అవుతున్న సమయంలో పదోవంతు తెలుగు భాషమీద, తెలుగు రచనలమీద కేంద్రీకృతమైనా చాలు, చదివేవారి స్థాయి, రాసేవారి స్థాయి గణనీయంగా పెరుగుతాయి. చదివేవారు పోచికోలు రాతలు చదవటం మాని సమకాలీన ఉత్తమ రచయితల రచనలని ఆస్వాదిస్తారు. రాసేవారు మనకి ప్రపంచస్థాయి రచనలు అందిస్తారు. సమాజం గర్వపడుతుంది.
ఈరోజు ప్రచురితమైన రెండు కథలు.
శుభం
No comments:
Post a Comment