సిరివెన్నెల పాటలక్కూడా వంకలు పెట్టచ్చా?
తెలీదండీ! షుమారుగా నలభై ఏళ్ళ నించీ చూస్తున్నాను. సీతారామశాస్త్రి గారి కవితామధురిమలో తన్మయత్వం చెందిన పండితపామరులు మనకి తెలుసు. ఆయన సాహిత్యాన్ని విశ్లేషించి, విడమరిచి, వివరించి మనకి పాట వినగానే స్ఫురించని సొబగులనీ అంతరార్ధాలనీ, పదార్ధాలని మనకందించబడిన అనేక వ్యాసాలని చదివాం. వీడియోలు చూశాం. ఎన్నివేల అమృతగుళికలు మనకిచ్చిపోయినా, ఆయన అప్పుడే పోయారా అని దుఃఖించాము, కృతజ్ఞతతో, కొంత స్వార్ధంతో.
ఆయన పాటలకి వంకలు పెట్టడమేమిటి?
ఒక్కొక్క పదం శాస్తి గారు ఎంత ఆచితూచి వేస్తారో, అవి ఎంత ప్రామాణికమో మనకితెలుసు.
మరెందుకీ ప్రేలాపన? ఈరోజు నా గ్రహచారం బాలేదు కాబట్టి. విపరీతబుద్ధి.
రహమాన్ కొన్ని వందల రసమలాయి పాటలు మనకందించాడు. ఎన్ని వేలమాట్లు విన్నా ఇంకా జుర్రుకుంటూనే ఉన్నాం. అతను రంగప్రవేశం చేసిన ఇరవై ఏళ్ళకి అనుకుంటా, తెల్లతోలువారు ఒక చల్తాహై పాటకి అదేదో ఆస్కారుట ఇచ్చి, కత్తిపట్టిన బొమ్మొకటి చేతిలో పెట్టారు. మనమూ చప్పట్లుకొట్టాం, ఇచ్చిన వాడు తెల్లమొహం వాడుగదా మరి!
సిరివెన్నెలకా సమస్య లేదు. 1986 నుంచే తెలుగువాళ్ళం ఆయన్ని సిరివెన్నెల అని పిలుచుకుంటున్నాం. 'సిరివెన్నెల' ఒక కళాతపస్వి తీసిన సినిమా అనీ అందులో సీతారామశాస్త్రి అజరామరమయిన పాటలు రాశాడు కాబట్టి అతని ఇంటిపేరు మనం మార్చేశామన్న సంగతి మర్చిపోయేటంతగా. మొదటిపాటకే ఆయనకి ఆంధ్రులు ఆస్కారిచ్చేసి మురిసిపోయారు. ఆతరువాత మూడున్నర దశకాలపాటు ఆయన రాసిన ప్రతిపాటా ఆస్కారు స్థాయిదే. మధురిమ తగ్గలేదు సరికదా, పాటపాటకూ పెరుగుతూ వచ్చింది.
ఇప్పుడు నాగొడవల్లా సిరివెన్నెలని సిరివెన్నెల చేసిన రెండు పాటల గురించే. మొదటిది తెలుగువారు గర్వంగా పాడుకునే 'విధాత తలపున ప్రభవించినది', రెండవది అదే సినిమాలో అంతే ప్రసిద్ధి చెందిన 'ఆదిభిక్షువు వాడినేది కోరేది'.
ముందుగా రెండవపాట గురించిన ధర్మసందేహం.
పల్లవి:
ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చే వాడినేది అడిగేది?
ఏది కోరేది? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?
చరణం1:
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది?
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది కోరేది?
ఏది కోరేదీ? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?
చరణం2:
తేనెలొలికే పూలబాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది?
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది?
ఏది కోరేదీ? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?
చరణం3:
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసిజేసినాడు వాడినేది కోరేది?
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది?
ముఖప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు || ఆది భిక్షువు ||
ఒక్క క్లిష్టపదంకూడా వాడలేదీ పాటలో కవి. లలితమైన తెలుగుపదాల నడక---అతికొద్ది తత్సమపదాలు, అవీ మనం వాడుకభాషలో ఉపయోగించేవే.
పల్లవి పరమశివుని చిత్రపటాన్ని శ్రోత మనోఫలకంమీద ప్రతిష్టించి భక్తితో మోకరింపచేస్తుంది. మనిషిని బొందితో కైలాసానికి తీసుకువెళ్ళగలిగే శక్తుందీ పల్లవికి.
చరణాలు--ఇక్కడగదయ్యా తుస్సుమనిపించావు శాస్తుర్లూ. శివుడిని మించిన యాచకుడు లేడనికదా పల్లవి! ఆయనే ఆదిభిక్షువు కనక మనంకూడా ఎవ్వరినీ ఏమీ అడగక్కరలేదని, అడగటానికి ఏమీ మిగల్లేదు అన్న ఎఱుకలోంచి కదా ఆత్మసమర్పణాభావం ఉప్పొంగింది? పల్లవి పండించిన భావరసాన్ని పరిపుష్టం చేయడానికి చరణాన్ని వాడుకుంటాడు గీతకారుడు. చరణానికి చరణానికి భావం (ఈపాటలో బూడిద తప్ప ఏమీ లేని ఆది భిక్షువు శివుడు) బలపడాలి.
పూలబాలలకి ఒకటిచ్చావు, బండరాళ్ళకి ఇంకోటిచ్చావ్; పద్ధతిగా ఇవ్వలేదు నాఉద్దేశంలో---అది మొదటి చరణం. పల్లవిలో ఏమీ ఇవ్వలేనివాడు చరణంలో ఎలా ఇచ్చాడు! భావపరిపుష్టం అవలేదు, విరోధాభాస అయింది, రసాభాస అయింది.
రెండో చరణంలో, రచయిత పాయింట్ ఆఫ్ వ్యూ లో శంకరుడు సరయిన పనులు చేయలేదు. ఇక్కడ ఇవ్వగలగడం, ఇవ్వలేక పోవడం ప్రసక్తే లేదు. ఆఁ ముఖప్రీతి కోరాడట! అర్ధం కాలే! పదాలు లయబద్ధంగా లేకపోయినా కిమ్మనకుండా ట్యూన్ కట్టేశాడు మహానుభావుడు మామా.
ముక్తాయింపుగా 'ముక్కంటి, ముక్కోపి, తిక్కోడు'. ఆమూడు పదాల్లోను ద్విత్వం ఉంది, పలకడానికి బావున్నాయి ఓకే--పల్లవిలోని థీమ్‌కి ఏమైనా పొసిగాయా? శ్రోతని తికమకపెట్టడం కాకపోతే? మంచి థీమ్‌ని ప్లాట్ బలహీనపరిచింది.
ఇప్పుడు చివరిగా మొదటి పాట.
పల్లవి:
విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం...
ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎదకనుమలలో, ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ...
సరసస్వర సురఝరీ గమనమౌ, సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం, ఈ గీతం ..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం
చరణం 1:
ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన,
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ||2||
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ, విశ్వ కావ్యమునకిది భాష్యముగా..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం
చరణం 2:
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగ సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం
ఈ పాటలో వాడినన్ని సంస్కృత పదాలు, పొడుగు సమాసాలు, పర్యాయపదాలు సీతారామ శాస్త్రిగారు ఇంకేపాటలోనూ వాడలేదనుకుంటాను. తెలుగుభాషాపరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న నాలాటి సామాన్యులు పాటలోని అర్ధాన్ని, అంతరార్ధాన్నీ ఒడిసిపట్టుకోవటానికి కొంత పరిశ్రమ చేయక తప్పదు. 'విహంగతతులే' సమాసంలో 'తతులు' పదానికి అర్ధం ఊహించినా మయూఖతంత్రులలో మయూఖం మాత్రం నిఘంటువు తెరిపిస్తుంది.
పాట విన్న ప్రతివారినీ పదసౌందర్యం ఉప్పెనలా కమ్మేసి మధురానుభూతితో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అక్కడోపదం ఇక్కడోపదం హృదయానికి తగిలినా చాలు ఊహలకి రెక్కలు వస్తాయి. అంతకు మించి ఏపాటకైనా ప్రయోజనం ఏముంటుంది?
ఉప్పెన శాంతించాక విశ్లేషణకి పూనుకుంటేనే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
విధాత అన్నా విరించి అన్నా ఒకరే. బ్రహ్మ. విపంచి అన్నా వేణియ అన్నా ఒకటే. వీణ.
పాట యావత్తూ ఒక గీతం గురించిన వర్ణన. గీతాన్నే గానం అనీ, నాదం అనీ, రాగం అనీ, స్వరమనీ, భాష్యమనీ, వేర్వేరు సందర్భాల్లో కవి ప్రస్తావించాడు. వర్ణన, వివరణ అయిన తరువాత మనకు వెలుగుతుంది---గీతం వేరేలేదనీ, వర్ణనే గీతం, గానం, భాష్యము కూడా అనీ! గానమేకాదు, అది ఒక మృదంగధ్వానం కూడానూ.
విధాత తలపున ప్రభవించినదైన జీవనవేదాన్నే కథానాయకుడు గానం చేస్తున్నాడు. అతనే బ్రహ్మ అయిపోయాడని సూచన. విరచించితిని, వినిపించితిని. నేపాడిన గీతం. భూతకాలంలో అన్న ధ్వనితో.
ఇక్కడ ఏయేకాలాలు కవి ఉపయోగించుకున్నాడో స్పష్టత లేదు. ప్రభవించినది, వినిపించితిని--రెండూ భూతకాలాలే. అయితే అర్ధంలో అందం లోపిస్తోంది. బ్రహ్మ ఒకప్పుడు పాడేసినపాట నేనూ పాడాను అన్న భావన వస్తోంది. భూతకాలం కాదు, నాయకుడి గానం తద్ధర్మకాలం అనుకుందాం. present indefinite.(నదీనాం సాగరో గతిః) ఉపనిషత్తు మంత్రంలా ఉన్నతంగా ఉంటుంది. అలా అనుకుంటే 'స్పందననొసగిన' బదులుగా 'స్పందననొసగే' అనీ, విరచించితిని వినిపించితిని స్థానంలో విరచించుదును వినిపించుదును రావాలి. 'గళమున పలికిన' బదులుగా 'గళమున పలుకు(పలికే)' రావాలి. రాలేదు. పదసౌందర్యానికి ప్రధమతాంబూలం దక్కింది.
'కనులకొలనులో ప్రతిబింబించిన'...ఎవరి కనులకొలనులో?
విహంగస్వనాలు జగతికి శ్రీకారం ఎలా అవుతాయి?
'చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగ ధ్వానం'--పదవిన్యాసమే గాని భావంలో స్పష్టత లేదు.
అనాది జీవనవేదం, ప్రణవనాదం ఓం---బాగానే ఉంది.
కొనసాగింపుగా అనాది రాగం, ఆది తాళం ఏమిటి?
పదాడంబరంకోసం వస్వైక్యాన్ని వదులుకున్నాడా సీతారాముడుశాస్త్రి?
పండితులెవరైనా నన్ను కేకలేస్తే లెంపలేసుకుంటాను.
No comments:
Post a Comment