Wednesday, January 31, 2024

తూనీగ తూనీగ

 


పాఠకుల సహకారం లేకపోతే కథకుడు పెరగలేడు. ఎన్ని కథలు రాసినా అతని స్థాయిలో గణనీయమైన మార్పులు రావు. రచయిత స్థాయిని నిర్ణయించేదీ పాఠకుడే. రచయిత రాసేది పాఠకుడి కోసమే కాబట్టి. పాఠకుడే రచయితకి అస్తిత్వాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి.

మీ అందరి చేయూతతో గత ఆరునెలలుగా నాకథలు కనీసం నెలకొకటి చొప్పున అంతర్జాల పత్రికలలో ప్రచురితమవుతూ వస్తున్నాయి. మీ సూచనలు నాకు దిశానిర్దేశం చేస్తున్నాయి. మిత్రులు కొంతమంది కథల నిడివి కొంచెం ఎక్కువ ఉండటంవలన చదువరులు తగ్గిపోతున్నారన్నారు. కథలలో అందరూ మంచిపాత్రలవడం వలన కథలలో పట్టు ఉండటం లేదన్నారు. ఈమాట పత్రిక ఆగస్టు  2023 సంచికలో వచ్చిన తూనీగ తూనీగ కథలో ఈరెండు లోపాలు లేవు. రాస్తున్నప్పుడు నాకు సంతృప్తి నిచ్చిన కథ. కథలో ఎవరూ ఎవరికీ నీతులు చెప్పరు. ఆయినా కథ పాఠకుడిని ఆలోచింపచేస్తుందని, ఒక ముఖ్యమైన సమకాలీన సామాజిక సమస్యకి సమాధానం వెతుక్కునేట్లు చేస్తుందనీ నమ్ముతాను.



తూనీగ తూనీగ


దూర్వాసుల వీరరాఘవయ్య గారు చూడచక్కని మనిషి. పొడవాటి విగ్రహం, చురుకైన కళ్ళు, పదునైన నాసిక, విశాలమైన ఛాతి, బుర్రమీసాలు, సగం నెరిసిన జుట్టు, మధ్య పాపిడి–వీర రాఘవయ్య గారిని మొదటి సారి చూసిన వారు ఆయన అరవై యేళ్ళ మధ్యతరగతి తెలుగు మనిషనుకోరు. ఇంకా పది సంవత్సరాల సర్వీసున్న పంజాబ్ రెజిమెంట్  కర్నలనుకుంటారు.


పది సంవత్సరాల క్రితం బొంబాయిలో తనకున్న అంధేరీ ఫ్లాట్, ఆరేకాలనీ ప్రాంతంలో ఇరవై ఏళ్ళు ఎలాగోలా నడిపిన లఘు పరిశ్రమని అమ్మేసుకుని హైదరాబాదు ఆల్వాల్ లో ఇల్లు కొనుక్కుని సెటిలయిపోయాడు. ఆమ్మకాళ్ళూ, కొనుగోళ్ళూ హుటాహుటిన ఇరవైరోజుల్లోనే ఎందుకు జరిపాడో బహుకొద్దిమందికి మాత్రమే తెలుసు.


దూర్వాసుల వారి భార్య శాంతమ్మ. ఆయనకంటే ఎనిమిదేళ్ళు వయస్సులో చిన్నది.  పద్ధైనిమిదేళ్ళప్పుడు పెళ్లి చేశారు. తెలిసిన సంబంధం, దూరపు బంధుత్వం ఉంది, పిల్ల డిగ్రీ చేసింది, దూర్వాసుల వారు దురాశలకి పోరులే అనే ధీమాతో. చిత్తూరు దగ్గర చిన్న ఊరిలో పుట్టి పెరిగిన శాంతమ్మకి, ఆంగ్ల సాహిత్యంలో బియ్యే అయిన శాంతమ్మకి, ఎందుకనో పాతికేళ్ళు బొంబాయిలో ఉన్నా నాలుగు వాక్యాలు ఇంగ్లీష్ లోకాని, హిందీలో కాని మాట్లాడగలిగే సామర్ధ్యం రాలేదు. తెలుగు వాళ్ళతో గ్రూపులు కట్టో, తెలుగేతరులతో సగం తెలుగు కలిపి హిందీ మాట్లాడో కొట్టుకొచ్చింది. మా ఆయన ఇంజనీయర్ ఇండస్ట్రియలిస్ట్ అని కొందరితో, మావారిది కృష్ణాతీరం తెలుసా అని కొందరితో, నేను కూరలు కొనటానికి కూడా కారులో వెళ్తాను డ్రైవ్ చేసుకుంటూ చూశారో లేదో అని కొందరితో, అహం కాపాడుకుంటూ, అహం పెంచుకుంటూ కొట్టుకొచ్చింది. అనతికాలంలోనే బొంబాయిలో మనుగడ ఇక చాలు, పదండి పోదాం ఆంధ్ర అనే పరిస్థితి తెచ్చుకుంది. 


అహం చూపించుకోవటానికి ఆవిడకంటే అనేక ఎక్కువ అర్హతలు, అవకాశాలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చుట్టుపక్కల. ఆవిడ అమేషా వాళ్ళకి దూరంగా ఉండేది. అసంకల్పిత ప్రతీకార చర్య.


వీర రాఘవయ్యకి ఇదంతా తెలుసు. ఆవిడ పుట్టింటినుంచి తెచ్చిన నాలుగు రూపాయలతో బొంబాయి జీవితానికి అంకురార్పణ జరిగిందని, ఆ బెట్టు, ఆధీమా, ఆ దెప్పు పెళ్ళాంనించి  జీవితాంతం భరించాలని తెలుసు. నాలుగు రూపాయలు నలభై చేశానుగా, నాప్రమేయమూ కొంత ఉంది అనటానికి లేదు. నా నాలుగే ఈ నలభై అని ఆవిడంటే తార్కికంగా ఆమె తప్పని ఆవిడ భాషలో ఆవిడని ఒప్పించలేడనీ తెలుసు. పరిమిత శక్తియుక్తులు భగవంతుడు ప్రతి వ్యక్తికీ కేటాయిస్తాడు. అవి ఎక్కడ ఎలా కేటాయించాలో తెలుసుకోలేని వీరరాఘవయ్య లాంటి వ్యక్తులు జీవితాన్ని నరకతుల్యం చేసుకుంటారు.


నాలుగు రూపాయలు ఫాక్టరీలో మిగలంగానే  తను నేర్చుకున్న బిజినెస్ మానేజ్ మెంట్ సూత్రాల్ని తుంగలో తొక్కి, పెళ్ళానికి కాసులపేరో రవ్వల నెక్లేసో కంచి పట్టు చీరలో కొనిపెడ్తాడు. వడ్డీ క్రమం తప్పకుండా అందుతుంటే అసలు కంటే వడ్డీ ముద్దు. శాంతమ్మకిక భర్తతో గొంతెత్తి మాట్లాడటానికి ఏవిషయమూ లేదు. యాతావాతా శాంతమ్మ భర్త అడుగులకి జవదాటదు. ఆయన కా అంటే కా, కీ అంటే కీ. ఆయన జీవితంలో సాధించిన ఏకైక విజయం భార్య తనను అంటిపెట్టుకుని ఉండేట్టు కట్టడి చేయగలగడం!


దూర్వాసుల వీరరాఘవయ్య, ధనేకుల బుద్ధరామయ్య కలిసి చదువుకున్నారు బెజవాడ మునిసిపాలిటీ బళ్ళో.  స్కూలుచదువయిన తర్వాత పిల్లలందరూ ఎవరిదారిన వారు ఎగిరి పోయారు. కంప్యూటర్లు లేని కాలమది. 


మూడు దశాబ్దాలయింది స్నేహితులకి ఒకరిగురించి ఒకరికి తెలిసి, ఒకరినొకరు కలిసి. బుద్ధ రామయ్య బాగానే పైకొచ్చాడు ముప్ఫై ఏళ్ళలో. పైకి రావడమంటే కూడపెట్టటమే కదా, ఓ ముప్పై కోట్ల ఆస్తి కూడబెట్టాడు.  జూబిలీలో పావు ఎకరం స్థలంలో  భవనం కట్టాడు కూడా. ఎలా కూడపెట్టాడో మనకనవసరం.


ఐదేళ్ళ కిందట బుద్ధరామయ్య భార్య  భార్గవి  తన భర్త పిన్ననాటి స్నేహితుని ఆచూకీ అంతర్జాలాన్ని, అంతకి మించిన తన వాడితనాన్ని, వాడి పసిగట్టింది. బుద్ధరామయ్యకి తన పద్థతిలో రూపాయలు పోగు చేసుకోవటమొకటే తెలిసి వచ్చింది కాని, ఈమెయిల్ అంటే ఏమిటో కూడా తెలియదు. భార్గవి ఎన్నాళ్ళు నేర్పప్రయత్నించినా అర్ధం కాలేదు. ఎవరిని ఎవరికి పొందు పరుస్తాడో ఆ భగవంతుడనబడేవానికే తెలియాలి. సృష్టి క్రమానుసారంగా ఏదో బలీయమైన కారణం ఉండి తీరాలి. భార్గవి పుణ్యాన మిత్రుడి విలాసం తెలిసిన భర్త దూర్వాసులని ఆల్వాల్లో కలిశాడు. మిత్రులు ఆలింగనం చేసుకున్నారు. 


అనంతరం నెలకొక సారో, రెండునెళ్ళ కొకసారో ధనేకులవారు  తమ మెర్సిడీజ్ లో ప్రయాణించి  ఆల్వాల్లో  దూర్వాసులవారిని కలుసుకుంటూనే ఉన్నారు. కారు భార్గవి నడుపుతుంది. డ్రైవరుకి ఆపూట సెలవిస్తారు. ఈసారి జూబిలీహిల్స్ రావటం మావంతు అంటూనే ఉంటాడుగాని దూర్వాసుల, ఆల్వాల్ వదలడు ప్రాణావసరంవస్తే తప్ప. ఆల్వాల్ పదానికి అర్ధం ఆప్తమిత్రుడు.


బుద్ధరామయ్యకి వీరరాఘవయ్యని చూస్తే అదొకరకమయిన ఆరాధ్య భావం. అతనితో గడిపిన రెండుమూడు గంటలు తనకి రెండుమూడు నెలలకి జీవించటానికి సరిపడా శక్తియుక్తుల్ని, కోరుకోకుండా తన ప్రమేయం లేకుండా సమకూరుస్తాయని నమ్మకం. అయిదేళ్ళుగా అనుభవైకవేద్యం.


గత దశాబ్దంగా భర్తకి లొంగిపోయిన శాంతమ్మ భరించలేనంత కృంగిపోయింది. భార్యని లొంగదీసుకున్న వీరరాఘవయ్య మరింతగా కృంగిపోయాడు. ఆవిడది సమాజమర్యాదా పాలన. ఈయనది తనకే తెలియని మేకపోతు గాంభీర్యం.


***



'రండి రండి'  ఆహ్వానించింది శాంతమ్మ ధనేకుల దంపతులని, ఆశ్చర్యపడుతూనే. ఆ ఆశ్చర్యంలో 'ఈరోజెందుకొచ్చారు చెప్పకుండా?' అనే అయిష్టత దాగి ఉంది. వాళ్ళు మామూలుగా వచ్చే సాయంత్రం నాలుగు గంటల టైముకే వచ్చారు.  టీ తాగి గంటో గంటన్నరో పిచ్చాపాటీ ‌మాట్లాడుకుని చీకటిపడే సమయానికి జూబిలీకొండలు చేరుకుంటారు. 


"సమయానికొచ్చావోయ్ బుద్ధా, ఈరోజు కుండలిని కొంచెం ఎక్కువ కదుల్తోంది. ఇవాళ నీకు తప్పదు. కూర్చోవాల్సిందే. ఏదో వంక చెప్పి ప్రతిసారీ తప్పించుకుంటున్నావు. అయినా బెంజి కారు నడిపేది భార్గవి కదా."  సమాధానం కోసం ఆగకుండా చెంగున సోఫాలోంచి లేచి అల్మిరా స్లైడింగ్ డోర్ తెరిచి రెండు కట్ గ్లాసులు సెంటర్ టేబుల్ మీద పెట్టాడు. హాలులో నాలుగు సోఫాలు, ఒక డబుల్, మూడు సింగిల్స్; టూ సీటరులో, సోఫా మధ్యలో ఎప్పుడూ వీరరాఘవయ్యే కూర్చుంటాడు, ఇంకోళ్ళు ఎవరూ కూర్చోడానికి వీల్లేదు అన్నట్టుగా.  లోపల ఎంత డొల్లతనముంటే అంత అహం ఏదో రూపేణా బహిర్గతమవుతుంది. హాలు మూడు గోడలకి మూడు తలుపులు ఉన్నాయి. ఒకటి వీధిలోకి పోవడానికి, రెడు చెరో బెడ్ రూమ్ లోకి వెళ్ళడానికి. ఒక టీవీ యూనిట్ ఒక అల్మిరా పెట్టేటప్పటికి హాలు నిండిపోయినట్టు అనిపిస్తోంది. మొత్తం సెటప్ నాటకాల వాళ్ళ స్టేజిని తలపిస్తోంది.


"నాకు ఒకటి తెలియక అడుగుతాను వీరా! స్కూల్లో నువ్వు చాలా అమాయకుడుగా సన్నగా అందరికంటే చిన్న పిల్లవాడి లాగా ఉండేవాడివి కదా, ముప్ఫై ఏళ్లలో ఎలా చండామార్కుడి వయిపోయావు?"  


వీ.రా. బుర్ర మీసాలు ఊగేంతగా మిలటరీ నవ్వు నవ్వాడు.

"క్రమశిక్షణ, సమయపాలన. ఇవేనోయ్ నా విజయ రహస్యాలు!"


అటువంటి గంభీర పదాలు ఎవరైనా, ఎప్పుడైనా నిత్యజీవితంలో  ఎలా మాట్లాడగలరో  బుద్ధరామయ్యకి అంతు పట్టదు. కుండలిని అంటాడేమిటి? అదేం భాష?


"ఓయ్ శాంతా మాకు టీ వద్దులే, మేము మరో కార్యక్రమంలో ఉన్నాం. మీరు మీమానాన ముచ్చట్లాడుకోండి."


రెండో బెడ్ రూమ్ నుంచి భార్గవి కొంచెం దుడుకుగానే వచ్చింది. సీను వివరంగా చూసింది. సభా మర్యాదకైనా నాలుగు గ్లాసులు పెట్టొచ్చుకదా! పురుషాధిక్యత కాకపోతే? అడుగుదామని నోటి దాకా వచ్చింది కానీ, బుద్ధని పరికించి చూసి తమాయించుకుని, 'ఎంజాయ్ యువర్ సెల్ఫ్' అంటూ శాంతమ్మ ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. భార్గవి వాలకంలోని  ఆంతర్యం గమనించిన వీరాకి  ఆమె చెహరా నచ్చలేదు. 'ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళనక్కడ పెట్టాలి.' మనసులో అనుకున్నాడు, బిగ్గరగానే.


"ఏం తీసుకుంటావోయ్?"  సమాధానం చెప్పలేనంత  బుద్ధిమంతుడు బుద్ధరామయ్య. ఇకిలించాడు, నాకేంతెలుసు అని ధ్వనించేంతగా. అతన్ని సమస్య నుంచి తప్పించడానికా అన్నట్లు వీరా  వెంటనే రెండు బీరాల్ని తెచ్చాడు తన బెడ్ రూమ్ ఫ్రిజు నుంచి. "తాగితే స్కాచ్ తాగాలి బుద్ధా, అదీ  సింగిల్ మాల్ట్. నెక్స్ట్ టైం."


"న్యూ జెర్సీలో  మీ అబ్బాయి, కోడలు మనవలు ఎలా ఉన్నారు? ఈమధ్య అక్కడికి మారారన్నావు."  కొంచెం బీయర్ గొంతులో నుంచి దిగంగానే బుద్ధ రిలాక్స్ అయ్యాడు.


"అక్కడికి వచ్చి ఉండిపోమంటాడు. సిటిజెన్షిప్ తీసుకోమంటాడు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంటాడు. నేను ఇంతవాణ్ణవడం మీ బిక్షే అంటాడు. సెంటిమెంటల్ ఫూల్." అతని గొంతులో అల్పులకి ధీరుత్వం, అధికులకి భీరుత్వం గోచరిస్తుంది.


***

"భార్గవీ నన్ను అర్థం చేసుకోవడానికి నువ్వు తప్ప ఎవరూ లేరు. మావారు వాట్సాప్ లో 'హౌ ఆర్ యు' అని,  రెండు రోజులు అదే‌పనిగా ఎదురు చూసిన తర్వాత,'ఐ యాం ఫైన్' అని రిప్లై ఇస్తాడు మావాడు. నాతో  అనరుకానీ ఆయన లోలోపల దిగులు పడుతున్నారేమో అని నాకు అనుమానం. ప్రతిసారీ ఆరు నెలలు అమెరికాలో ఉందాం అనుకొని వెళ్తాం, రెండు నెలల్లో ఆయనకి ఏదో నచ్చదు, వెనక్కి వచ్చేస్తాం.  మళ్ళీ ఏదో వెలితి పడతారు. చెప్పరుగాని పిల్లల మీద తల్లుల కంటే తండ్రులకే ఎక్కువ ప్రేమ ఉంటుంది."


శాంతమ్మ ఆలోచనలో అచ్చు తప్పుందని భార్గవి సునాయాసంగా గమనించింది.  తండ్రి పొడ కొడుకుకి సుతరామూ గిట్టటంలేదని తెలుస్తూనే ఉంది.  కొడుకు తనను కోరుకోవాలనే కోరికేగాని, ఆకోరికకి తగిన పాత్రత ఈయనలో ఉందా?  


సగం సముదాయింపుగాను, సగం సరిదిద్దు చర్యగానూ, "ఇంత పచ్చిగా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు శాంతా. మీ ఆయన్ని బాగానే స్టడీ చేశాను. ఆయన్లో మనిషి తక్కువ, డొల్లతనం ఎక్కువ. ఆయన  మూర్ఖత్వానికి నీ తానాతందానాయే కారణం.  అతని బలహీనతలని చేతనైతే తగ్గించు. తగ్గించలేకపోతే మానె, ప్రాణాంతకమవకుండా చూసుకో."


***

బుధ్థ  బీరా ఇంకా పూర్తవలేదు వీరా బీరాలు వింటుంటే. వీరా మరో బీరాపట్టాడు.

"నా చేతికి విద్యాశాఖ అప్పగించమను. బద్ధకాన్ని, నిర్లిప్తతని, దేశాన్నించి తోలిపారేస్తాను. చైనావాడి క్రమశిక్షణ ఇండియాలో తెస్తాను. బూట్ కాంప్ అంటే తెలుసా నీకు. అమెరికా వాడు మరీన్లని తయారు చేస్తాడు బూట్ కాంప్ లో. ఒక దృష్టిలో క్రమశిక్షణకి పరాకాష్ట, ఇంకో దృష్టిలో అమానుషమైన హింస. అమెరికా 'అంతా మన కర్మ' అని గోళ్ళు గిల్లుకుంటూ అగ్రరాజ్యమవలేదు. 


దేశంలో యువతకి మనసు, శరీరం రాటు తేలాలి. కండ ఉంటేనే గుండె. ఇరవై ఏళ్ళవయస్సు వచ్చే వరకూ ఆడా మగా యుద్ధం నేర్చుకున్నట్లు విద్య నేర్చుకోవాలి. చేతకాని దేశాలు నేలమీద మగ్గిపోనీ. ఇండియా పైకి పైపైకి ఎక్కుతూ పోవాలి. అవసరమైతే పక్కవారి పీకలు కోసైనా సరే. శిఖరాన్ని అధిరోహించాలంటే కొన్ని త్యాగాలు, బలిదానాలు తప్పవు."


" నీవంటి చిత్తశుద్ధి, వాగ్ధాటి ఉన్నవాళ్లు ప్రభుత్వంలో ఉంటే, దేశం ఎక్కడికి దూసుకెల్తుందో?" మెచ్చుకోలు.


***

షెల్ఫ్ మీద పడేసినట్లుగాఉన్న  ఒక చిన్న ఫ్రేము చేసిన అమ్మాయి ఫోటో భార్గవికంటబడింది. వీళ్ళు వచ్చే సమయానికి ఆఫొటోనే చూసుకొంటోంది రెండో బెడ్రూంలో శాంతమ్మ. "ఫొటో ఎవరిది శాంతా?" ఉలిక్కి పడ్డట్టు లేచి, ఆఫొటోని పెట్టెలో దాచేయబోయింది శాంతమ్మ.


 "ఎవరి ఫొటో అది?"అనునయంగా భార్గవి.


"మా అమ్మాయిది." చెప్పింది గద్గద స్వరంతో, చెమర్చిన కళ్ళతో. " నీకు పుణ్యం ఉంటుంది. ఫొటో విషయం పొరపాటునకూడా ఎవరితోనూ అనకు, ముఖ్యంగా మీ ఆయనతో. అమ్మాయి తాలూకు ఏ ఆనమాలు ఇంట్లో కనబడినా ఆయన ఒప్పుకోరు. వద్దన్న పని చేశామని తెలిస్తే ఆయన కోపం పట్టలేము."


" అయిదేళ్ళయింది మనం కలిసి. కూతురుండేదని ఎప్పుడూ చెప్పలేదే. మీకు అబ్బాయి ఒకడే సంతానమనుకుంటున్నాం."


"అలా అనే మేమూ, అందరితో పాటు  అనుకోవాలని ఆయన ఆజ్ఞ."  శాంత దుఃఖం గమనించి భార్గవి మరే ప్రశ్నా వేయలేదు‌. రెండు నిమిషాల మౌనం తర్వాత శాంతమ్మే పెదవి విప్పింది.


"ఈ రోజుకి  పది సంవత్సరాలు విద్యావతి పోయి." మరో నిముషం మౌనం.


"విద్యావతికి వాళ్ళ నాన్న అంటే అమితమైన గౌరవం. తండ్రి మెప్పు పొందాలనీ, అన్న కున్నంత ప్రయోజకత్వం తనకీ ఉందని తండ్రికి  నిరూపించాలని తపించేది. ఆ తపనతోనే చివరి శ్వాసదాకా అహర్నిశలూ శ్రమించింది."


శాంతమ్మ ఆలోచనల్లో ఈసారి మరిన్ని అచ్చుతప్పులు కనిపించాయి భార్గవికి. 


***


"ఇక బయల్దేరతాం వీరా, ఆరు దాటింది," బుద్ధరామయ్య ఒక బీరుతో కొట్టు కట్టేస్తే, వీరా నాలుగవ సీసా ఓపెన్ చేశాడు. బుద్ధ ఒక వాక్యం ప్రశ్నిస్తున్నట్లుగా  అడిగితే, వీరా నాలుగు వాక్యాలు  బోధ రూపంలో  మాట్లాడాడు.   యువశక్తి, దేశాభ్యుదయానికి సంఘర్షణ యొక్క ఆవశ్యకత, లంచగొండితనం నిర్మూలన, కార్యసాధనకి ప్రణాళికారూపకల్పన, దశాబ్దకాలంలో భారతదేశం ఎలా ప్రపంచంలో అగ్రగామి దేశంగా పురోగమించగలదు వంటి అంశాలమీద తన స్పష్టమైన అభిప్రాయాలు స్వచ్ఛమైన భాషలో చెప్పాడు.


"మా చిన్నమ్మాయి ఇంటరుకొచ్చింది. దాన్ని ఐఐటీ లో పడెయ్యాలనుంది. అవసరమైతే రెండు కోట్లు పారేస్తా. నువ్వే సలహా చెప్పాలి." లేస్తూ అన్నాడు బుద్ధరామయ్య.


దూర్వాసుల స్పందించలేదు. ఆ విన్నపం అసందర్భంగా తోచిందో, సందర్భవశాత్తూ ఎక్కడన్నా గుచ్చుకుందో. ఏతుట్టెని కదిలిస్తే ఆతుట్టె తేనెటీగలు కరుస్తాయి.


భార్గవి కెందుకో  ఈరోజు వీర రాఘవయ్యతో వెళ్ళొస్తాం అని  చెప్పబుద్ధవలేదు. తన్నుతాను పొడుచుకోవాల్సిన మనిషి ఉన్మాదంలో ఎదుటిమనిషిని పొడిచి కొంత జీవితకాలాన్ని అరువు తెచ్చుకున్న నిర్భాగ్యుడిలా కనిపించాడు. ప్రాథమిక మర్యాద పాటించాలని కూడా అనిపించలేదు. చకచకా నడుస్తూ కారు తీసింది. బుద్ధరామయ్య భార్యని బుద్ధిగా అనుసరించాడు.


***


దూర్వాసుల వీరరాఘవయ్యకి ఎక్కడో ఏదో నచ్చలేదు. ఏం నచ్చలేదో తెలియక పోవడం అంతకన్నా నచ్చలేదు. చర్రున లేచి పెద్ద పెద్ద అంగలతో బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. శబ్దం వచ్చేటట్టు తలుపు దభీమని మూసాడు. అలా  మూయటం లోపలికి ఎవరూ రావద్దని, తనంతట తను బయటకు వచ్చే దాకా ఎవరూ పిలవద్దని సంకేతం. ముఖ్యంగా భార్యకి.


కిటికీ రెక్క కొద్దిగా తెరిచి కిటికీ పక్కకి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. శ్వాసలో రుసరుస తగ్గించుకునే ప్రయత్నంలో రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. సన్నగా చినుకులు పడినట్లు ఉన్నాయి, దొడ్డిలో నేల చిత్తడిగా ఉంది. పశ్చిమ ఆకాశంలో మబ్బులు  అప్పుడే దిగిపోయిన సూర్యుని చివరి  కిరణాల అరుణిమతో  ఆడుకుంటున్నాయి.


బుజ్ మని  శబ్దం చేస్తూ పెద్ద రెక్కల తూనీగ ఒకటి కిటికీలోంచి వెలుతురు వెతుక్కుంటూ రూమ్ లోకి వచ్చింది. మళ్లీ బయటికి వెళ్లడానికి వీల్లేదన్నట్టుగా వీరా కిటికీ తలుపు మూశాడు. ఎంతోసేపు ఎగిరి అలిసిపోయిందో, వెతుక్కుంటున్న వస్తువు దొరకని నిస్పృహో, తూనీగ గోడ మీద నిదానంగా వాలింది. మెల్లగా కదులుతున్న తూనీగ రెక్కల్ని పరిశీలనగా చూశాడు రెప్పార్చకుండా.  రెక్కల మధ్య దూరం తగ్గిన క్షణంలో చటుక్కున్న రెండు రెక్కలు ఒడిసి పట్టుకున్నాడు. అతని చూపుడు  బొటన వేళ్ళ మధ్య తూనీగ బందీ అయింది. గిలగిలా కొట్టుకుంది. బలాత్కారానికి గురి అవుతున్న అబలలాగా.  పట్టు వదలకుండా తన వైపు తిప్పుకుని, కొట్టుకుంటున్న తూనీగ శరీర భాగాల్ని సునిశితంగా పరికించాడు. చెయ్యి మార్చుకుందాం అనే ఉద్దేశంతో రెక్కల చివరలని రెండో చేతితో కూడా నొక్కి పట్టుకున్నాడు. రెండోచేతికి పనిచెప్పి మొదటి చేతికి విశ్రాంతిద్దామని.


ఈ ఉధృతానికి తట్టుకోలేని సున్నితమైన తూనీగ రెక్కలు సగానికి చిరిగి విరిగిపోయాయి. అప్రయత్నంగా రెండు చేతులు వదిలేశాడు. జటాయువులా నేల మీద పడిన తూనీగ మళ్లీ ఎగరడానికి ప్రయత్నిస్తూ, విఫలమౌతూ,  గిలగిలలాడింది. ఆ ప్రయత్నాన్ని వీరరాఘవయ్య ఎంతో ముచ్చటగా మెచ్చుకుంటూ చూశాడు. దానికి అలసట మీద ఆకలి వేస్తోందేమో, ఏమైనా తినటానికి పెట్టాలేమో అని జాలికూడా పడ్డాడు. తూనీగ తినదగిన పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని రూమంతా  కలయచూశాడు. కొంచెం ఎత్తులో గూడు పెట్టడం అప్పుడే పూర్తి చేసిన సాలె పురుగు ఒకటి కనిపించింది. పురుగులు తినే తూనీగకి పురుగులు తిన్న సాలె పురుగు మంచి ఆహారం అవుతుంది కదా అని నిశ్చయించుకున్నాడు. డ్రాయర్ లోంచి తీసిన స్కేలు పట్టుకుని  లేచి నిలబడి సాలెపురుగుని ఒక్క దెబ్బ కొట్టాడు. చితికిన సాలెపురుగు, రసి స్కేలుకి అతుక్కుతున్నాయి.


ఎడమచేతి రెండు వేళ్ళతో తూనీగ సగానికి తెగిన రెక్కలని కలిపి పట్టుకుని పైకి లేపాడు.  కుడిచేతితో స్కేలు పట్టుకొని స్కేలు చివర ఉన్న సాలెపురుగు  కళేబరాన్ని తూనీగ మూతికి అందించాడు. తూనీగ తింటున్నట్టుగా తోచలేదు. రాచీ, నొక్కీ, చేతనైన ప్రయత్నం చేశాడు. 


సెకన్లలో తూనీగలో కదలిక ఆగిపోయింది. హత్య పూర్తయింది. చట్టం హత్య అని గుర్తించలేని హత్య.


చచ్చిపోయిన తూనీగని కమోడ్లో పడేసి ఫ్లష్ కొట్టాడు. స్కేలుని వాష్ బేసిన్ లో కడిగి డ్రాయర్లో పెట్టాడు. చేతులు శుభ్రంగా కడుక్కుని రూము తలుపులు తీసి భోజనానికి తయారయ్యాడు.


సరిగ్గా ఇదేరోజు పది సంవత్సరాల క్రితం విద్యావతి ఐఐటి బాంబే లేడీస్ హాస్టల్లో ఉరిపోసుకు చచ్చిపోయింది.

                                                   

*****



































Monday, January 29, 2024

సాహిర్ లుధ్యాన్వీ

జీవితం అన్న పదానికి సంపాదన మారుపేరు.

ఏదో పొందుదామని, పొంది ఎక్కడికో చేరుకుందామని అని శ్వాసశ్వాసనా మనిషికిగల అంతర్గత కాంక్షకి మరోపేరు సంపాదన.

పుట్టిన ప్రతి మనిషీ జీవించినంతకాలం సంపాదిస్తూనే ఉంటాడు. కనీసం సంపాదనే ధ్యేయంగా రోజు గడుపుతాడు. మీరూ నేనుకూడా ఈ సూత్రానికి భిన్నం కాదు.

అందులో తప్పేమీలేదు. సిగ్గుపడవలసిందీ లేదు. ఏ కోరిక లేకపోతే అసలు బతకడం ఎందుకు? ప్రాయోపవేశం చేసుకుని జీవితం చాలించుకోవచ్చుగా!

సంపాదించాలనే కోరిక ఫలస్వరూపం ఆస్తి, సంపద.

ఇన్కమ్ టాక్స్ వాళ్లు గుర్తించే నెట్వర్త్ కాక ఇంకేమైనా ఆస్తి ఉంటుందా?

ఉంటుంది. అదే నిజమైన ఆస్తి. ఎంత అనుభవించినా తరగని ఆస్తి.  కుటుంబానికి, ఇరుగుపొరుగుకి ఎంత రాసినా తరగని ఆస్తి.

ఇనప్పెట్టిలో మూలుగుతున్న,  రేపు తిందామనుకునే ఆస్తి కాదు.

ఈ క్షణం అనుభవించగలిగే ఆస్తి. అస్తిత్వానికి అసలైన నిర్వచనం అనిపించుకోగలిగే ఆస్తి. వర్తమానానికి సిసలైన స్వరూపమైన  ఆస్తి.

మనమందరం సంపాదించుకున్న ఆస్తి. అప్పనంగా భగవంతుడిచ్చిన ఆస్తి. ఆశీర్వచనం.

ఉదాహరణకి బాలసుబ్రమణ్యం నా ఆస్తి. బాల మురళి నా ఆస్తి.

ఈ రెండు ఉదాహరణలు చాలవూ, చాన్తాడంత నా ఆస్తి అంతా మీకెందుకు ఏకరువు పెట్టాలి? మీ ఆస్తి మీది నా ఆస్తి నాది.

సాహిర్ లుధ్యాన్వీ నా ఆస్తిలో పెద్ద పద్దు.

ఆయన రాసినవి అనేక గీతాలు. ఆ పెద్ద పద్దులో ఇదోఎంట్రీ.

"మై పల్‌దో పల్‌కా షాయర్‌ హూ"

నా ఆస్తి ఈక్షణంలో అనుభవించద్దూ, నాకొచ్చిన నాతెలుగులో?


నేనీ నిముషపు రచయితని

నిముషము  మెరిసే మిరుమిట్లు

వెనువెంటనే కమ్మే చీ‌కట్లు 


మహనీయులు కవులూ గాయకులు

మురిపించి కనుమరుగయినారు

నిముసము సేపూ అందరు

మేలిమి బంగరు మరి కొందరు


నా రచనలు నువ్వూ మెచ్చావు

నిన్నేమయినా అవి మార్చాయా

నేనే మయినా  మరి మారానా

అసలెందుకు ఎవరూ మారాలి?


ఆరాముడు ఇపుడే మెరిశాడు

రఘురాముడు కొలువుతీరాడు

రచనలు లల్లా రచియిస్తాడు

నీ వీనుల మళ్ళీ విందవుతాడు


రేపటి రోజున రాబోరా 

వేలకు వేలు కవి పుంగవులు

విశ్వనాధలు శ్రీశ్రీలు

సిరివెన్నెలలు, శ్రీనాధులు


నేనూ ఒక రచయితనైతే

నువ్వూ ఒక పాఠకుడివైపో

ఈ నిముషానికది పర్యాప్తం

మరు నిముషములో సమాప్తం


https://youtu.be/QkGqpVYjLUw?si=sWtNxVVHJQx3qU3R


 



 

Thursday, January 25, 2024

సిరివెన్నెల పాటలక్కూడా వంకలు పెట్టచ్చా?

 సిరివెన్నెల పాటలక్కూడా వంకలు పెట్టచ్చా?


తెలీదండీ! షుమారుగా నలభై ఏళ్ళ నించీ చూస్తున్నాను. సీతారామశాస్త్రి గారి కవితామధురిమలో తన్మయత్వం చెందిన పండితపామరులు మనకి తెలుసు.  ఆయన సాహిత్యాన్ని విశ్లేషించి, విడమరిచి, వివరించి మనకి పాట వినగానే స్ఫురించని సొబగులనీ అంతరార్ధాలనీ, పదార్ధాలని మనకందించబడిన అనేక వ్యాసాలని చదివాం. వీడియోలు చూశాం. ఎన్నివేల అమృతగుళికలు మనకిచ్చిపోయినా, ఆయన అప్పుడే పోయారా అని దుఃఖించాము,  కృతజ్ఞతతో, కొంత స్వార్ధంతో.

ఆయన పాటలకి వంకలు పెట్టడమేమిటి?

ఒక్కొక్క పదం శాస్తి గారు ఎంత ఆచితూచి వేస్తారో, అవి ఎంత ప్రామాణికమో మనకితెలుసు. 

మరెందుకీ ప్రేలాపన? ఈరోజు నా గ్రహచారం బాలేదు కాబట్టి. విపరీతబుద్ధి.


రహమాన్ కొన్ని వందల రసమలాయి పాటలు మనకందించాడు. ఎన్ని వేలమాట్లు విన్నా ఇంకా జుర్రుకుంటూనే ఉన్నాం. అతను రంగప్రవేశం చేసిన ఇరవై ఏళ్ళకి అనుకుంటా, తెల్లతోలువారు ఒక చల్తాహై పాటకి అదేదో ఆస్కారుట ఇచ్చి, కత్తిపట్టిన బొమ్మొకటి చేతిలో పెట్టారు. మనమూ చప్పట్లుకొట్టాం, ఇచ్చిన వాడు తెల్లమొహం వాడుగదా మరి!


సిరివెన్నెలకా సమస్య లేదు. 1986 నుంచే తెలుగువాళ్ళం ఆయన్ని సిరివెన్నెల అని  పిలుచుకుంటున్నాం. 'సిరివెన్నెల'  ఒక కళాతపస్వి తీసిన సినిమా అనీ అందులో సీతారామశాస్త్రి అజరామరమయిన పాటలు రాశాడు కాబట్టి అతని ఇంటిపేరు మనం మార్చేశామన్న సంగతి మర్చిపోయేటంతగా. మొదటిపాటకే ఆయనకి ఆంధ్రులు ఆస్కారిచ్చేసి మురిసిపోయారు. ఆతరువాత మూడున్నర దశకాలపాటు ఆయన రాసిన ప్రతిపాటా ఆస్కారు స్థాయిదే. మధురిమ తగ్గలేదు సరికదా, పాటపాటకూ పెరుగుతూ వచ్చింది.


ఇప్పుడు నాగొడవల్లా సిరివెన్నెలని సిరివెన్నెల చేసిన రెండు పాటల గురించే. మొదటిది తెలుగువారు గర్వంగా పాడుకునే 'విధాత తలపున ప్రభవించినది', రెండవది అదే సినిమాలో అంతే ప్రసిద్ధి చెందిన 'ఆదిభిక్షువు వాడినేది కోరేది'. 


ముందుగా రెండవపాట గురించిన ధర్మసందేహం.

పల్లవి:

ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చే వాడినేది అడిగేది? 

ఏది కోరేది? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?

చరణం1:

తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది? 

కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది కోరేది?

ఏది కోరేదీ? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?

చరణం2:

తేనెలొలికే పూలబాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది? 

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది?

ఏది కోరేదీ? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?

చరణం3:

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసిజేసినాడు వాడినేది కోరేది?

వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది?

ముఖప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది

ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు || ఆది భిక్షువు ||


ఒక్క క్లిష్టపదంకూడా వాడలేదీ పాటలో కవి. లలితమైన తెలుగుపదాల నడక---అతికొద్ది తత్సమపదాలు, అవీ మనం వాడుకభాషలో ఉపయోగించేవే.


పల్లవి పరమశివుని చిత్రపటాన్ని శ్రోత మనోఫలకంమీద ప్రతిష్టించి భక్తితో మోకరింపచేస్తుంది. మనిషిని బొందితో కైలాసానికి తీసుకువెళ్ళగలిగే శక్తుందీ పల్లవికి.


చరణాలు--ఇక్కడగదయ్యా తుస్సుమనిపించావు శాస్తుర్లూ. శివుడిని మించిన యాచకుడు లేడనికదా పల్లవి! ఆయనే ఆదిభిక్షువు కనక మనంకూడా ఎవ్వరినీ ఏమీ అడగక్కరలేదని, అడగటానికి ఏమీ మిగల్లేదు అన్న ఎఱుకలోంచి కదా ఆత్మసమర్పణాభావం ఉప్పొంగింది? పల్లవి పండించిన భావరసాన్ని పరిపుష్టం చేయడానికి చరణాన్ని వాడుకుంటాడు గీతకారుడు. చరణానికి చరణానికి భావం (ఈపాటలో బూడిద తప్ప ఏమీ లేని ఆది భిక్షువు శివుడు) బలపడాలి.


పూలబాలలకి ఒకటిచ్చావు, బండరాళ్ళకి ఇంకోటిచ్చావ్; పద్ధతిగా ఇవ్వలేదు నాఉద్దేశంలో---అది మొదటి చరణం. పల్లవిలో ఏమీ ఇవ్వలేనివాడు చరణంలో ఎలా ఇచ్చాడు! భావపరిపుష్టం అవలేదు, విరోధాభాస అయింది, రసాభాస అయింది.


రెండో చరణంలో, రచయిత పాయింట్‌ ఆఫ్‌ వ్యూ లో శంకరుడు సరయిన పనులు చేయలేదు. ఇక్కడ ఇవ్వగలగడం, ఇవ్వలేక పోవడం ప్రసక్తే లేదు. ఆఁ ముఖప్రీతి కోరాడట! అర్ధం కాలే! పదాలు లయబద్ధంగా లేకపోయినా కిమ్మనకుండా ట్యూన్‌ కట్టేశాడు మహానుభావుడు మామా‌.


ముక్తాయింపుగా 'ముక్కంటి, ముక్కోపి, తిక్కోడు'.  ఆమూడు పదాల్లోను ద్విత్వం ఉంది, పలకడానికి బావున్నాయి ఓకే--పల్లవిలోని థీమ్‌కి ఏమైనా పొసిగాయా? శ్రోతని తికమకపెట్టడం కాకపోతే? మంచి థీమ్‌ని ప్లాట్‌ బలహీనపరిచింది.



ఇప్పుడు చివరిగా మొదటి పాట.



పల్లవి:

విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం...

ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ...

కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం

ఎదకనుమలలో, ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ...

సరసస్వర సురఝరీ గమనమౌ, సామ వేద సారమిది 


నే పాడిన జీవన గీతం, ఈ గీతం ..

విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం


చరణం 1:

ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన,

జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ||2||


పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ, విశ్వ కావ్యమునకిది భాష్యముగా..

విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం 2:

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం


చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం

  

అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగ సాగిన సృష్టి విలాసమునే

విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం



ఈ పాటలో వాడినన్ని సంస్కృత పదాలు, పొడుగు సమాసాలు, పర్యాయపదాలు సీతారామ శాస్త్రిగారు ఇంకేపాటలోనూ వాడలేదనుకుంటాను.‌ తెలుగుభాషాపరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న నాలాటి సామాన్యులు పాటలోని అర్ధాన్ని, అంతరార్ధాన్నీ ఒడిసిపట్టుకోవటానికి కొంత పరిశ్రమ చేయక తప్పదు. 'విహంగతతులే' సమాసంలో 'తతులు' పదానికి అర్ధం ఊహించినా మయూఖతంత్రులలో మయూఖం మాత్రం నిఘంటువు తెరిపిస్తుంది.


పాట విన్న ప్రతివారినీ పదసౌందర్యం ఉప్పెనలా కమ్మేసి మధురానుభూతితో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అక్కడోపదం ఇక్కడోపదం హృదయానికి తగిలినా చాలు ఊహలకి రెక్కలు వస్తాయి. అంతకు మించి ఏపాటకైనా ప్రయోజనం ఏముంటుంది?


ఉప్పెన శాంతించాక విశ్లేషణకి పూనుకుంటేనే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

విధాత అన్నా విరించి అన్నా ఒకరే. బ్రహ్మ. విపంచి అన్నా వేణియ అన్నా ఒకటే. వీణ.

పాట యావత్తూ ఒక గీతం గురించిన వర్ణన. గీతాన్నే గానం అనీ, నాదం అనీ, రాగం అనీ, స్వరమనీ, భాష్యమనీ, వేర్వేరు సందర్భాల్లో కవి ప్రస్తావించాడు. వర్ణన, వివరణ అయిన తరువాత మనకు వెలుగుతుంది---గీతం వేరేలేదనీ, వర్ణనే గీతం, గానం, భాష్యము కూడా అనీ! గానమేకాదు, అది ఒక మృదంగధ్వానం కూడానూ.

విధాత తలపున ప్రభవించినదైన జీవనవేదాన్నే కథానాయకుడు గానం చేస్తున్నాడు. అతనే బ్రహ్మ అయిపోయాడని సూచన. విరచించితిని, వినిపించితిని.  నేపాడిన గీతం. భూతకాలంలో అన్న ధ్వనితో.


ఇక్కడ ఏయేకాలాలు కవి ఉపయోగించుకున్నాడో స్పష్టత లేదు. ప్రభవించినది, వినిపించితిని--రెండూ భూతకాలాలే. అయితే అర్ధంలో అందం లోపిస్తోంది. బ్రహ్మ ఒకప్పుడు పాడేసినపాట నేనూ పాడాను అన్న భావన వస్తోంది.  భూతకాలం కాదు, నాయకుడి గానం తద్ధర్మకాలం అనుకుందాం. present indefinite.(నదీనాం సాగరో గతిః) ఉపనిషత్తు మంత్రంలా ఉన్నతంగా ఉంటుంది. అలా అనుకుంటే 'స్పందననొసగిన' బదులుగా 'స్పందననొసగే' అనీ, విరచించితిని వినిపించితిని స్థానంలో విరచించుదును వినిపించుదును రావాలి. 'గళమున పలికిన' బదులుగా 'గళమున పలుకు(పలికే)' రావాలి. రాలేదు. పదసౌందర్యానికి ప్రధమతాంబూలం దక్కింది.

'కనులకొలనులో ప్రతిబింబించిన'...ఎవరి కనులకొలనులో?

విహంగస్వనాలు జగతికి శ్రీకారం ఎలా అవుతాయి?

'చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగ ధ్వానం'--పదవిన్యాసమే గాని భావంలో స్పష్టత లేదు.


అనాది జీవనవేదం, ప్రణవనాదం ఓం---బాగానే ఉంది.

కొనసాగింపుగా అనాది రాగం, ఆది తాళం ఏమిటి?


పదాడంబరంకోసం వస్వైక్యాన్ని వదులుకున్నాడా సీతారాముడుశాస్త్రి?


పండితులెవరైనా నన్ను కేకలేస్తే లెంపలేసుకుంటాను.






 













Monday, January 1, 2024

రాసే వారెందుకు రాయాలి? చదివే వారెందుకు చదవాలి?

రాసే వారెందుకు రాయాలి?

నిజమే కదండీ! వృత్తిపరంగానో వ్యాపారంలో భాగంగానో, కళాశాలల్లో నిబంధనగానో రాసేవాళ్ళని పక్కన పెడదాం. ఈ మూడు విభాగాలకి చెందనివారుకూడా పుటలుపుటలుగా పుంఖానుపుంఖాలుగా రాస్తూనే ఉన్నారు. వీరికి ధనాపేక్ష ఉండక పోవచ్చు. ఒకవేళ ఉన్నా రూపాయి లాటరీ టికెట్‌ కొని  లక్షరూపాయలు వస్తాయని ఆశించడం వంటిదని వారికి తెలుసు. అయినా కథలు, నవలలు, వ్యాసాలు, కవితలు, ఉపదేశాలు, రాస్తూనే ఉన్నారు. సుమారుగా గత రెండు దశాబ్దాలుగా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని రచయితలు సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ప్రమాణాలు పాటిస్తూ, నాణ్యతలు పెంచుకుంటూ రాసేవారి సంఖ్య పూర్వం కంటే  పెరగకపోవచ్చు, నిజానికి తగ్గుతూ ఉండవచ్చు. రచనలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి.  అధిక శాతం తెలుగులో రాసేవాళ్ళు మను చరిత్ర, వేయిపడగలు వంటి రచనలు చదివి ఉండరు. కొంతమంది ఆపేర్లుకూడా వినిఉండకపోవచ్చు. రాయలేని వారు  ఎందుకు రాస్తున్నారు? ఎందుకు రాయాలి?

మనపేరు అచ్చులో చూసుకోవటం ఒక థ్రిల్. తెలుగులో టైప్‌ చెయ్యటం తెలుసుకోవటానికి కావలిసిన అయిదు నిమిషాలు వెచ్చించటానికి ససేమిరా అంటూ పది సంవత్సరాల నించీ తెలుగుని ఇంగ్లీషులోనే రాసే ఉదాత్తులకి కూడా పేరుని అచ్చులో చూసుకోడం థ్ర్రిల్. వారు  తెలుగు భాష ఔన్నత్యాన్ని సైతం ఆంగ్లలిపిలోనే తెలుగురాసి  మనకి వివరిస్తారు. ఆ థ్రిల్‌  తరవాత లైకులు. జూకర్‌బర్గ్ ఏముహూర్తాన లైకు అన్న పదాన్ని ప్రపంచం మీద వదిలాడోగాని నేడు రోటీ కపడా మకాన్‌ తర్వాత లైకు నిత్యావసర వస్తువైపోయింది. 

ఏ ప్రశ్నకో "నాకటువంటివి ఇష్టంలేదు" వంటి సమాధానం రాసి, ఆ గొప్ప సమాధానానికి ఎన్ని లైకులొచ్చాయో అయిదునిముషాలకి ఒకసారి ఫోను చూసుకునే పరిస్థితి. ఈమాత్రం కూడా రాయలేనివారు 'ఫార్వార్డు' లు చేస్తారు. లైకులు చూసుకోవడం షరా మామూలే. లైకులేకాదు, 'షేర్'లవాలని కోరుకుంటారు.

చదివారెందుకు చదవాలి?

ఇదీ ముఖ్యమైన ప్రశ్నే. ఎవరూ చదవకపోతే, లైకులందుకోకపోతే ఇన్నేసి నాసిరకం రాతలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఛదివేవారూ ఎంతకొంత రాసేవారే కాబట్టి. తోటి లైకువాంఛితులు ఏంరాస్తున్నారో చూడాలి కాబట్టి. లైకులో అన్‌లైకులో కొట్టాలి కాబట్టి.  రచనలకి మార్కులేసే జడ్జి పీఠంలో మన్ని మనం ప్రతిష్టించుకున్నాం కాబట్టి. లైకులందుకోవడానికి సామాజిక పరిచయాలు అవసరం కాబట్టి. పరస్పరావసరం కాబట్టి. నూటికో కోటికో ఒక కళ్ళు తిప్పుకోలేని రచన తటస్థ పడుతుంది. గొప్ప రచనని తెలుస్తుంది కాని లోపల ఎక్కడో ఏదో గుచ్చుకుంటుంది. రాసినవాడు ఇంతకుముందే  తెలిసినవాడైతే మరీ గుచ్చుకుంటుంది. స్నేహితురాలి మెడలో అందమైన వజ్రాలహారంచూసి 'బావుంది కానీ మీ చెల్లెలికి బాగా నప్పుతుంది' అన్న దిగదుడుపు ధోరణిలో విమర్శలు రాస్తారు. రాజమౌళి మూడు సంవత్సరాలు శ్రమించి సినిమా తీస్తే దానిగురించి తెలిసీ తెలియని విమర్శలు రాసి అయిదుకి మూడుచుక్కలిచ్చి ఘనకార్యం చేసినట్లు ఫీలయే వారిలాగా!

రాసేవారి స్థాయి, చదివేవారి స్థాయి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. తెలుగువారు జాతిరీత్యా మేధావులు. వారి మేధస్సు ప్రస్తుతం ఫోన్లమీద వృధా అవుతున్న సమయంలో  పదోవంతు తెలుగు భాషమీద, తెలుగు రచనలమీద కేంద్రీకృతమైనా చాలు, చదివేవారి స్థాయి, రాసేవారి స్థాయి గణనీయంగా పెరుగుతాయి. చదివేవారు పోచికోలు రాతలు చదవటం మాని సమకాలీన ఉత్తమ రచయితల రచనలని ఆస్వాదిస్తారు. రాసేవారు మనకి ప్రపంచస్థాయి రచనలు అందిస్తారు. సమాజం గర్వపడుతుంది.  

ఈరోజు ప్రచురితమైన రెండు కథలు.


ఆటకట్టు 
https://www.koumudi.net/Monthly/2024/january/index.html


శుభం 







Friday, December 22, 2023

ఏదో రాద్దామని

 

రారోయి మా ఇంటికి. 

మా ఇంటిగడప ఎక్కువమంది తొక్కరు. నాకు మాట్లాడటం చేతకాదు కనక. 

కానీ వచ్చినవారిని ఉత్తచేతులతో వెనక్కి పంపను. ఒట్టు.

నాకు మాట్లాడటం రాదు గానీ నా రచనలకొచ్చుగా!


అక్కడో రాత, ఇక్కడో రాత దశాబ్దాలుగా కాగితం మీదకి ప్రకటిత మవుతూనే ఉన్నాయి. కొన్ని చిత్తు కాగితాలకే పరిమితమయినా, పంపించినవాటిని పత్రికలవారు ఏమూడ్‌లో ఉన్నారో మరి, ప్రచురించారు. కొన్ని రాతలు కొంతమంది మిత్రులు బావున్నాయని కూడా అన్నారు. ఎప్పుడో వచ్చినవి, ఈమధ్య వచ్చినవి, బయటికి రావటానికి ప్రసవవేదన పడుతున్నవి అన్నిటినీ కలిపి ఒకచోట కూర్చోపెడదామనే ప్రయత్నమే ఈ బ్లాగు ఏదో రాద్దామని.



ఈమధ్య  పత్రికలతో పంచుకున్న రచనలు. కొన్ని కథలు, ఒక పాట.

త్వరలో ఈవేదికద్వారా నాకథలకి ముందుమాట రాస్తాను.



ఆత్మకాకి      https://eemaata.com/em/issues/202306
  

తూనీగ తూనీగ    https://eemaata.com/em/issues/202308/31621.html


రసికులకనురాగమై ...  https://www.madhuravani.com/copy-of-%E0%B0%86%E0%B0%A7-%E0%B0%A8-%E0%B0%95%E0%B0%A4-%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%A5-%E0%B0%AF-%E0%B0%B2


తదనంతరం  https://sanchika.com/tadanantaram-mls-story/


ఏకం సత్   https://sanchika.com/ekam-sat-mls/


వేడుకొంటిని వేలసారులు   https://eemaata.com/em/issues/202309/31912.html


https://youtu.be/HaknDbrevFo?si=nJyj5KuLa3oq3S9L


టైముంటే చదవండి. ఇంకా టైముంటే వ్యాఖ్యానించండి. మీ కష్టం ఉంచుకోను.




తూనీగ తూనీగ

  పాఠకుల సహకారం లేకపోతే కథకుడు పెరగలేడు. ఎన్ని కథలు రాసినా అతని స్థాయిలో గణనీయమైన మార్పులు రావు. రచయిత స్థాయిని నిర్ణయించేదీ పాఠకుడే. రచయిత ...